నాపైనా, హెచ్‌డీ దేవేగౌడపై గౌరవం ఉంటే 48 గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని- హాసన సెక్స్ స్కాండల్‌లో కీలక నిందితుడు, ఎంపీ ప్రజ్వల్‌కు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘చట్ట ప్రకారం కేసు విచారణకు హాజరవ్వు. ఎన్ని రోజులు దొంగా పోలీసు ఆట ఆడతావు? విదేశం నుంచి వచ్చి విచారణకు సహకరించు’ అని ప్రజ్వల్‌కు హితవు పలికారు. అశ్లీల వీడియోల కేసు అందరినీ తల దించుకునేలా చేసిందని అన్నారు. ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ఈ కేసులో తమకు సంబంధం లేకపోయినా దేవేగౌడ, తన పేరును ముడిపెట్టారని వాపోయారు.
రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తానని దేవేగౌడ ప్రకటించగా, తామంతా అడ్డుకున్నామని కుమారస్వామి చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజ్వల్ ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లాడని.. ఒక వారంలో వచ్చి విచారణకు హాజరవుతానని ప్రకటించిన అనంతరం అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో భారత్‌కు వచ్చేందుకు వెనకడుగు వేసి ఉండవచ్చని అన్నారు.