భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. అయితే అజ్ఞాతంలో ఉన్న ఆయన రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్‌ను విచారించేందుకు సోమవారం దిల్లీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు వెళ్లి రాత్రి వరకు వేచి చూసినా ఆయన రాలేదు. దీంతో ఆయనకు చెందిన రెండు కార్లు, రూ.36 లక్షల నగదు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
అయితే సోమవారం అర్ధరాత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఝార్ఖండ్ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీ చేరుకోగా వారితో సోమవారం మధ్యాహ్నం హేమంత్ సోరెన్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీతో రాష్ట్ర నాయకత్వ మార్పు ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. తన సతీమణికి సోరెన్ సీఎం పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.