మైసూరు నగర అభివృద్ధి సంస్థ (ముడా) భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రతిపక్షాలు అబద్ధాలు సృష్టించాయి. ఇప్పుడు వాటిని నిజమని రుజువు చేయలేక ఆందోళన చెందుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి నాకు భయపడాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు సిద్దరామయ్య.
మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్ ( సిఐటిబి ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ముడా ఏర్పడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బావమరిది మల్లికార్జున స్వామి గ్రామం సర్వేనెంబర్ 464 లో ఉన్న 3.6 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు. ఈ భూమిని మల్లికార్జున స్వామి మైసూర్ కు చెందిన నింగాబింగ్ ఔరా చిన్న కుమారుడు దేవరాజు నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులలో ఉంది.
అదే దేవరాజు వారి తండ్రి మరణించాక మల్లికార్జున స్వామి ఆడపడుచు లాంచనంగా, సిద్ధరామయ్య భార్య పార్వతికి దానవిక్రయం చేశారు. సదరు భూమిని ముడా స్వాధీనం చేసుకుని పార్కు ఏర్పాటు చేసింది. పరిహారంగా వారికి 14 ఇళ్ల స్థలాలను కేటాయించింది. ప్రస్తుతం ఈ ఇళ్ల స్థలాల విలువ 70 కోట్లకు పైగానే పలుకుతోంది.
సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని బిజెపి, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. ఈ ఇంటి స్థలాలను అక్రమంగా పొందిన సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయాలని రాజ్ భవన్ కు ఫిర్యాదులు అందాయి. అయితే 2020లో బిజెపి ప్రభుత్వ హయాంలోనే ఇదంతా జరిగిందని సిద్దరామయ్య చెప్తున్నారు.