వారానికి 5 రోజులే బ్యాంకు కార్యకలాపాలు.. ప్రభుత్వానికి IBA ప్రతిపాదనలు

-

త్వరలో బ్యాంకులు కూడా వారానికి 5 రోజులే పనిచేయనున్నాయట. భారత ప్రభుత్వానికి ఇండియన్‌ బ్యాంకింగ్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఈ ప్రతిపాదన పంపినట్లు వార్తాసంస్థ సీఎన్‌బీసీ వెల్లడించింది. దీనికి బదులుగా రోజూ 40 నిమిషాలు అదనంగా బ్యాంకు ఉద్యోగులు పనిచేయాలని ప్రతిపాదించారట. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు జులై 28న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్స్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీఏ)తో ఐబీఏ సమావేశం కానుంది.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పనిదినాలను వారానికి 5 రోజులుగా మారుస్తూ, ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకులకూ ఇదే విధానాన్ని అమలు చేయాలని యూబీఎఫ్‌ఏ కోరింది. బ్యాంకు ఉద్యోగుల వేతనాల పెంపు, పదవీ విరమణ చేసిన వారికి ఆరోగ్య బీమా పాలసీ తదితర అంశాలపైనా చర్చించి, ఐబీఏ దృష్టికి తీసుకెళ్లింది. వీటిపై వచ్చే వారం ఇరు వర్గాలూ చర్చించబోతున్నాయి. ఇందులో ప్రధానంగా బ్యాంకు పనిదినాలపైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకుల పనిదినాలను వారానికి 5 రోజులు చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news