కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అరడజను కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు షురూ చేసింది. మరోవైపు ఈ మహమ్మారిని పారద్రోలే ఔషధాలను సమకూర్చుకునే పనిలో పడింది. అయితే నిఫా వైరస్.. కరోనా కంటే చాలా డేంజర్ అని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. కొవిడ్ కేసుల్లో మరణాలు 2 – 3 శాతం మాత్రమే ఉండగా.. నిఫా వైరస్ వల్ల 40 – 70 శాతం ఉంటాయని తెలిపింది.
కేరళలో ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇంకా తెలియలేదని, నిఫా వ్యాప్తిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకొంటున్నామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ తెలిపారు. ఐసీఎంఆర్ వద్ద ప్రస్తుతం 10 మంది రోగులకు సరిపడా మోనోక్లీనల్ యాంటీబాడీ మందు ఉందని.. మరో 20 డోసుల మందును ఆస్ట్రేలియా నుంచి కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. భారత్‌లో ఇప్పటివరకు నిఫా వైరస్ రోగుల్లో ఒక్కరికి కూడా మోనోక్లీనల్ యాంటీబాడీల మందు ఇవ్వలేదని.. ఇన్ఫెక్షను ప్రారంభ దశలో ఉన్నపుడే ఈ మందు వాడాలని సూచించారు. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్లు 2018లో వెల్లడైందని.. కానీ, ఈ వ్యాధి గబ్బిలాల నుంచి ఎలా వ్యాప్తి చెందుతుందో కచ్చితంగా చెప్పలేమని రాజీవ్ అన్నారు.