సింధునది పై భారత్ డ్యామ్ కడితే కూల్చేస్తాం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

0
18

భారత్ తో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ భారత్ ను రెచ్చగొట్టేలా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను అడ్డుకునేందుకు నదిపై భారత్ డ్యామ్ కడితే ఏం చేస్తారని ఓ ఇంటర్వ్యూలో ఖవాజాను మీడియా ప్రశ్నించింది. ఒకవేళ భారత్ ఆ పని చేస్తే ఎలాంటి కట్టడాలనైనా పాక్ ధ్వంసం చేస్తుందని బదులు ఇచ్చారు. ఇండియా దాడికి పాల్పడితే అందుకు రెట్టింపు స్థాయిలో బదులిస్తామని ఇటీవల ఆసిఫ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరోవైపు సమయం గడిచే కొద్ది యుద్ధం జరగడానికి అవకాశాలు పెరుగుతున్నాయని.. ఆ పరిస్థితి రాకుండా ఆపేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నా భారత్ విననడం లేదన్నారు. యుద్ధం జరుగకుండా ఆ దేవుడే ఆపాలి అని వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత్ దాడికి పాల్పడితే.. తన ప్రతిదాడి అంతకు మించి ఉంటుందని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్తత పెంచేలా పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అబ్దాలీ బాలిస్టిక్ మిసైల్ ను తాజాగా పరీక్షించింది. 450 కిలోమీటర్ల పరిధిని కలిగిన ఆ క్షిపణిిని ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించవచ్చని తెలిపింది.