ఓబీసీలకు రిజర్వేషన్లు వచ్చాక లోక్ సభలో 250 సీట్ల మార్కును కాంగ్రెస్ అందుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. అందుకే వారిని కులాలుగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తాజాగా జార్ఖండ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. “నేను ఒక్కటే అడుగుతున్నా. మీరు విడిపోవాలని అనుకుంటున్నారా..? అలా ముక్కలు అయితే మీ వాయిస్ బలహీనపడదా..? గుర్తుంచుకోండి.ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే” అని అన్నారు. సోనియా, మన్మోహన్ పదేళ్ల పాలనలో జార్ఖండ్ కు రూ.80వేల కోట్లు ఇస్తే తాము రూ.3లక్షల కోట్లు ఇచ్చామన్నారు.
జార్ఖండ్ లో అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ పార్టీలు ఓబీసీలను విభజిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగించే అవకాశం ఉందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు కాంగ్రెస్ వ్యతిరేకమని తెలిపారు. వీరందరూ ఐక్యంగా లేనంత వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చోటా నాగ్ పూర్ ప్రాంతంలో 125 కంటే ఎక్కువ ఉప కులాలు ఓబీసీలుగా పరిగనించబడుతున్నాయని గుర్తు చేశారు.