రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ సందర్భంగా నాలుగు రాష్ట్రాలకు ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రాష్ట్రాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే ఆ రాష్ట్రాల ప్రభుత్వాలకు ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మరోవైపు సోమవారం రోజున ముంబయి మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇవే కాకుండా ఇక అస్సాం, మేఘాలయాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు.
‘జులై 12న పశ్చిమబెంగాల్, సిక్కిమ్‌లలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బిహార్‌లో రానున్న మూడు రోజులు వానలు పడతాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలో మాత్రం జులై 11 వరకు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చు. జులై 12న దిల్లీ, హరియాణ, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్‌లో కూడా వానలు కురవొచ్చు.’ అని వాతావరణ శాఖ వెల్లడించింది.