డిసెంబర్ మొదటి వారంలోకి అడుగుపెట్టినా ఈ ఏడాది చలి తీవ్రత అంత ఎక్కువగా కనిపించడం లేదు. గతేడాది ఇదే సమయానికి దుప్పటిలో నుంచి కాళ్లూచేతులు బయటపెట్టాలంటే వణుకు పుట్టేది. ఇక పనులపై బయటకు వెళ్లాలంటే స్వెటర్లు, మఫ్లర్లు, ఇంకా చలితీవ్రతను తట్టుకునేలా అంతా రెడీ చేసుకుని భయంభయంగా వణుకుతూ వెళ్లేవారు. కానీ ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది.
అయితే ఈ ఏడాది దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అంచనా వేశారు. ఫిబ్రవరి వరకు కొనసాగే శీతాకాలంలో దేశ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి కొనసాగవచ్చని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనికి భిన్నమైన పరిస్థితులు ఉండవచ్చని.. సగటు వర్షపాతం కూడా సాధారణం కన్నా కాస్త ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.