కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్

-

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మణిపుర్ అంశం అట్టుడికిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటామి ఇండియా పట్టుబడుతోంది. అయితే దీనికి అధికార పక్షం ససేమిరా అన్నట్లు వ్యవహరించడంతో ఎలాగైనా మోదీతో ప్రకటన చేయాల్సిందేనని మరో కీలక అడుగు వేశాయి విపక్ష కూటమిలోని కొన్ని పార్టీలు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంపై ‘అవిశ్వాస తీర్మాన ’ అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది.

లోక్‌సభ లో కాంగ్రెస్‌ డిప్యూటీ నేత గౌరవ్‌ గొగొయ్‌.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్‌ నేత మాణికం ఠాగూర్‌ వెల్లడించారు. అటు బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్‌ కార్యాలయానికి కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నోటీసులిచ్చినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news