ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో భారత్ సెకండ్ ప్లేస్ కి చేరింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్… పాకిస్తాన్ టీం ను వెనక్కి నెట్టి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలోకి వెళ్ళింది. భారత్ తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై నెగ్గగా, రెండో మ్యాచ్లో ఆఫ్గాన్ ను మట్టి కరిపించింది. కాగా, రెండు మ్యాచ్ లోను భారీ నెట్ రన్ రేట్ తో నెగ్గిన న్యూజిలాండ్ టాప్ లో ఉండగా, పాక్ 3, సౌత్ ఆఫ్రికా 4వ స్థానంలో ఉన్నాయి.
కాగా,ఆఫ్ఘన్ విధించిన 273 పరుగుల విజయ లక్ష్యాన్ని 15 ఓవర్ల ముందే భారత్ చేదించింది. తొలుత లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక సెంచరీతో భారత్ విజయానికి బాటలు వేశాడు. రోహిత్ శర్మ కేవలం 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ దాడులను తుత్తునియలు చేసిన హిట్ మ్యాన్ ఏకంగా 16 ఫోర్లు, 5 సిక్స ర్లు కొట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా రోహిత్ వశమయ్యాయి.