పాకిస్థాన్ లాంటి దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని భారత్ ఎద్దేవా చేసింది. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాక్కు ఉందని ఆరోపించింది. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద ఫ్యాక్టరీలను ఆపాలంటూ పాకిస్థాన్పై విరుచుకుపడింది. స్విట్జర్లాండ్ జెనీవాలో జరిగిన ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) 148వ సమావేశంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, చాలా మంది దీనిని ఆదర్శంగా తీసుకుంటున్నారని హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాద దాడులు చేస్తూనే, మరోవైపు మానవ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పటం హస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఐపీయూ వంటి వేదిక ప్రాముఖ్యాన్ని పాకిస్థాన్ తగ్గించకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయటం వంటి వాటిల్లో పాకిస్థాన్కు చరిత్ర ఉందని ఐపీయూ సభ్యులకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. యూఎన్ భద్రతా మండలి నిషేధించిన అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల్లో పాకిస్థాన్కు రికార్డు ఉందని తెలిపారు.