గత నెలలో భారీ వర్షాలు భారత్‌ను విపరీతంగా వణికించాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇక దక్షిణ భారత్‌లో తెలంగాణలో దాదాపు పది రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు కురిసి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అయితే తాజాగా నాలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో రానున్న రెండు, మూడు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉత్తరాఖండ్‌లో ఆగస్టు 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్, పౌరి గర్వాల్, నైనిటల్, ఉదమ్ సింఘ్ నగర్, తెహ్రీ, చంపావత్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో వర్షాలకు కొండచరియలు విరిగి పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కొండచరియలు విరిగి కారుపై పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు.