2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ లో భారత్ జీ-20 సమావేశాలను నిర్వహించడం పట్ల పాక్, చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆ దేశాల వ్యాఖ్యలపై స్పందించారు ప్రధాని మోదీ.
వారి అభ్యంతరాలను కొట్టిపారేశారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణం అని పేర్కొన్నారు. ఈ జీ-20 సదస్సుతో భారత్ విజన్ ఏంటో ప్రపంచ దేశాలకు అర్థమవుతుందని వెల్లడించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదం కేవలం భారత్ కే పరిమితం కాకుండా ప్రపంచానికి దిక్సూచిగా మారిందన్నారు.
100 వ స్వతంత్ర దినోత్సవం జరుపుకునే నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ లో ఇకపై అవినీతికి, కుల రాజకీయాలకు తావు ఉండదని తేల్చి చెప్పారు. ఇలాంటి వాటికి దేశంలో చోటు ఉండదని అన్నారు. అలాగే త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న విశ్వాసం తమకు ఉందన్నారు.