అరేబియా సముద్రంలో మరో రెస్క్యూ ఆపరేషన్.. పాకిస్థానీలను కాపాడిన ఇండియన్ నేవీ

-

ఇండియన్ నేవీ మరోసారి సముద్ర దొంగల ఆటకట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన చేపల బోటును రక్షించింది. అందులోని దాదాపు 23 మంది పాకిస్థానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు భారత నౌకాదళ అధికారులు తెలిపారు.

గల్ఫ్‌ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్‌ మైళ్ల దూరంలో గురువారం రోజున ఇరాన్‌కు చెందిన చేపల ‘ఏఐ- కంబార్’ బోటును పైరేట్స్ హైజాక్‌ చేశారు. తొమ్మిది మంది పైరేట్స్ (సముద్ర దొంగలు) పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇండియన్ నేవీకి సమాచారం అందడంతో రంగంలోకి దిగిన భారత్ నౌకదళం ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. తొలుత ఐఎన్‌ఎస్‌ సుమేధా సముద్ర దొంగల అదుపులో ఉన్న బోటును అడ్డగించి, ఆ తర్వాత ఆపరేషన్లో చేరిన ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ నౌక సంయుక్తంగా దొంగల ఆట కట్టించాయి. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్‌ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థాన్‌ జాతీయులు సురక్షితంగా రక్షించినట్లు భారత్ నేవీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news