త్వరలోనే రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెలాఖరులోపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే నెల పదో తేదీలోపు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మంత్రివర్గం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వేతన సవరణ కోసం కమిషన్‌ను నియమించడంతో పాటు మధ్యంతర భృతి కూడా ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
- అనాథ చిన్నారుల కోసం ప్రత్యేక విధానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉంది.
- ఇటీవల జిల్లాల పర్యటనల సందర్భంగా కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. వాటిలో కొన్నింటికి మంత్రివర్గం ఆమోదం అవసరం.
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధిత అంశాలు సహా ఇతర అంశాలు కూడా చర్చకు తీసుకోవచ్చని సమాచారం.