భారత ప్రజలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తీపి కబురు అందించారు. చంద్రయాన్-3లోని అన్ని వ్యవస్థలూ సక్రమంగా పని చేస్తున్నాయని తెలిపారు. కొద్దిరోజుల్లో అది చంద్రుడి చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. అక్కడి నుంచి జాబిల్లికి మరింత చేరువయ్యే క్రమంలో కక్ష్య నిర్ధారణ ప్రక్రియ చాలా కీలకం కానుందని వెల్లడించారు.
వంద కిలోమీటర్ల వరకూ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని సోమనాథ్ అన్నారు. ఆ తర్వాత భూమి నుంచి ల్యాండర్ స్థితిని నిర్దిష్టంగా అంచనావేయడమే సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని.. ఇది చాలా కీలకమైన కొలత అని చెప్పారు. దీన్ని ‘కక్ష్య నిర్ధారణ ప్రక్రియ’గా పేర్కొంటామని.. అది సక్రమంగా ఉంటే.. మిగతా ప్రక్రియ మొత్తం సాఫీగా సాగిపోతుందన్నారు. ఈ దఫా చంద్రయాన్-3 కక్ష్యను అత్యంత కచ్చితత్వంతో కిందకి దించామని.. ప్రణాళిక ప్రకారమే ఇది సాగుతోందని వెల్లడించారు. అందువల్ల రానున్న రోజుల్లోనూ అంతా సవ్యంగానే సాగుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.