భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి ఘనవిజయం సాధించిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై అడుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్ తనకు అప్పగించిన పనిని పూర్తి చేసిందని ఆ సంస్థ ఛైర్మన్ సోమనాథ్ చెప్పారు. ఇప్పుడు ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేం లేదని తెలిపారు. ఖగోళాన్ని మరింతలోతుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)పై ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్లు స్పష్టం చేశారు. నవంబర్ లేదా డిసెంబర్లో ఈ ప్రయోగం ఉంటుందని వెల్లడించారు.
ప్రజ్ఞాన్ రోవర్ ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉంది. చంద్రుడిపై రాత్రి పూట (భూమిపై 15 రోజులకు సమానం) పగలు కంటే దాదాపు 200 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఒకవేళ ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లు ఈ ఉష్ణోగ్రత మార్పును తట్టుకొని నిలబడగలిగితే.. రోవర్ కచ్చితంగా మేల్కొంటుంది. ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలకం కాకపోయినా ఫర్వాలేదు. అని సోమనాథ్ తెలిపారు. చంద్రుడిపై వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 2న రోవర్, 4న ల్యాండర్‌ను ఇస్రో నిద్రాణస్థితికి పంపిన విషయం తెలిసిందే. జాబిల్లిపై రాత్రి సమయం పూర్తయిన తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేల్కొలిపేందుకు ఇటీవల ఇస్రో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.