జాబిల్లిపై దుమ్ము రేపిన విక్రమ్.. ల్యాండింగ్ సమయంలో గాల్లోకి ఎగిసిన 2 టన్నుల మట్టి

-

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైన విషయం తెలిసిందే. అయితే చంద్రయాన్-3లోని విక్రమ్, ప్రగ్యాన్ రోవర్​లు ఇప్పటికీ ఇంకా నిద్రాణ స్థితిలోనే ఉన్నాయి. అవి ఇంకా నిద్ర లేచే పరిస్థితులు లేవని.. ప్రయోగం అక్కడితో ముగిసినట్టేటని అందరూ భావించారు. కానీ ఇటీవల ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాత్రం ఇంకా ఆశలున్నాయి. కొద్దిరోజుల్లో ప్రగ్యాన్ మేల్కొనే అవకాశం ఉందని తెలిపారు.

ఇక తాజాగా ఇస్రో చంద్రయాన్-3 గురించి మరో లేటెస్డ్ అప్డేట్ ఇచ్చింది. చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌ చందమామపై ల్యాండ్ అయిన సమయంలో దుమ్ము రేపిందని ఇస్రో తెలిపింది. ల్యాండింగ్‌ సమయంలో గాల్లోకి 2 టన్నుల మట్టి ఎగిసినట్లు వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అయిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయని పేర్కొంది. ఫలితంగా ఆ ప్రదేశం ప్రకాశవంతంగా కనిపిస్తోందని వివరించింది. దీన్ని ‘ఎజెక్టా హాలో’ అని పిలుస్తారని ఇస్రో పేర్కొంది. విక్రమ్‌ కిందకి దిగేటప్పుడు డిసెంట్‌ స్టేజ్‌ రాకెట్ల ప్రజ్వలన వల్ల జాబిల్లి ఉపరితలం నుంచి భారీగా ధూళి పైకి ఎగిసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news