ఇస్రో శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. నిర్దేశించిన పరీక్షలన్నీ సాఫీగా సాగితే ఈ ప్రయోగం చేపడతామని వెల్లడించారు. ఆ తర్వాత కూడా ప్రయోగాన్ని చేపట్టవచ్చని, అయితే ఇందుకు ఇంధనాన్ని ఎక్కువగా వెచ్చించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రయాన్-3 వ్యోమనౌక శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రానికి చేరుకుందని వివరించారు.
‘‘తుది ఏర్పాట్లు ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. చంద్రయాన్-3 ప్రయోగానికి ఎల్‌వీఎం-3ని ఉపయోగిస్తాం. దాని కూర్పు పని సాగుతోంది. దానికి సంబంధించిన భాగాలన్నీ శ్రీహరికోట చేరుకున్నాయి’’ అని సోమనాథ్ తెలిపారు. రాకెట్ కూర్పు ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆ తర్వాత చంద్రయాన్-3ని రాకెట్‌తో అనుసంధానిస్తామని వెల్లడించారు. దీని ప్రయోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు వ్యోమనౌకలో అనేక మార్పులు చేపట్టామని అన్నారు. ఎక్కువ సౌరశక్తిని ఒడిసిపెట్టేలా పెద్ద సోలార్ ప్యానెల్స్ అమర్చినట్లు తెలిపారు.