చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద భారతదేశం అడుగుపెట్టింది. ఆదిత్య ఎల్1తో సూర్యుడి గుట్టు కనిపెట్టే పనిలో పడింది. ఈ ఏడాది ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రయోగాలను విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రాబోయే ఐదేళ్లకు పక్కా ప్రణాళిక రచించింది. రాబోయే ఐదేళ్లలో 50 ఉపగ్రహ ప్రయోగాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. భౌగోళిక నిఘా సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మహారాష్ట్రలోని ముంబయిలో ఐఐటీ బాంబే గురువారం నిర్వహించిన ‘టెక్‌ఫెస్ట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పొరలుగా మోహరించడం ద్వారా బలగాల కదలికలపై నిశితంగా కన్నేసి ఉంచొచ్చు. వేల కిలోమీటర్ల వైశాల్యంలో పర్యవేక్షణ కొనసాగించొచ్చు. మార్పులను గుర్తించేలా ఉపగ్రహాల సామర్థ్యాలను మెరుగుపరచడం, డేటా విశ్లేషణకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడం కీలకం. భారీ స్థాయిలో శాటిలైట్‌లను ప్రయోగించగలిగితే దేశానికి ముప్పును తగ్గించొచ్చు.” అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు.