జస్టిస్ యశ్వంత్ వర్మకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నోట్లకట్టల వివాదం నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్‌వర్మను న్యాయవిధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్ ద్వారా తాజాగా హైకోర్టు వెల్లడించింది. ఇటీవల ఆయన ఇంట్లో అగ్నిప్రమాదంలో భారీగా నోట్లకట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.
సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో.. తన స్టోర్ రూంలో తానుగానీ, కుటుంబ సభ్యులు ఎటువంటి నగదును ఉంచలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ తెలిపారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. తన పరువుకు భంగం కలిగించడానికి ఎవరో కొందరు కావాలని చేసిన కుట్ర అని ఆరోపించారు. కుటుంబ సభ్యులు, తన సబ్బందికి నగదును చూపించలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని భార్యతో కలిసి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లానని చెప్పిన జస్టిస్ యశ్వంత్ వర్మ.. స్టోర్ రూం నుంచి నగదును తొలగించామన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.