ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురు అయింది. ముడా కేసులో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశించిన విషయం విధితమే. అయితే ముడా కేసులో తనను విచారించకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లారు సీఎం సిద్ధరామయ్య. కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య పిటిషన్ ను కొట్టివేసింది. తాజాగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు సిద్ధరామయ్య.
ముడా భూముల కేటాయింపులలో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందని ఆరోపిస్తూ.. ఓ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు పై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్పందించారు. దీంతో గవర్నర్ సిద్దరామయ్యను విచారించాలని ఆదేశాలు జారీ చేసారు. దీనిపై గత నెలలోనే సిద్దరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ముందుకెళ్లవద్దని సూచించింది. తాజాగా ఈ పిటిషన్ పై వెలువరించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం గవర్నర్ చర్యను సమర్థించింది.