సంచలన నిర్ణయాలు తీసుకుంటూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ను రాష్ట్రంలో రద్దు కోరుతూ తీర్మానం చేసింది. ప్రతిపాదిత బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం లేదా, కామన్ ఎంట్రన్ టెస్ట్‌తో పరీక్ష జరపాలని కేబినెట్ ప్రతిపాదించగా.. దీనికి సంబంధించిన బిల్లు కర్ణాటక విధాన సభ ముందుకు త్వరలోనే రానుంది.
గతంలో మాదిరి ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా, సొంతంగా ప్రవేశాలు చేపట్టేలా రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల నిర్వహించిన నీట్ (యూజీ) పేపర్ లీక్ కావడం, పలు అక్రమాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే. పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.