లైంగిక వేధింపుల విషయంలో కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల బెంగళూరులో ఓ యువతిపై లైంగిక దాడి జరిగిన అంశంపై మాట్లాడుతూ.. బెంగళూరు వంటి నగరాల్లో మహిళలపై ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా జరిగిన ఘటనలో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని.. బహిరంగ ప్రదేశాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని హోంమంత్రి అన్నారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయడం సిగ్గుచేటు అని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉండేందుకు అర్హులు కాదంటూ మరికొందరు మంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి హోంమంత్రి వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి.