జమ్ముకశ్మీర్లోని కథువాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు చేసిన ఆకస్మిక దాడిలో ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అనుబంధ ముఠా కశ్మీర్ టైగర్స్ ప్రకటించుకుంది. అయితే ఈ ముఠా ఈమధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి చొరబడినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం పోలీసులు, పారామిలటరీ దళం సాయంతో సైనిక సిబ్బంది ఎదురుదాడికి దిగడం వల్ల ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయిన విషయం తెలిసిందే. వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకొని ముష్కరులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ చేపట్టాయి.
మరోవైపు కథువాలో భారత ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడం చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మన బలగాలపై పిరికి దాడులు అత్యంత ఖండనీయం అని పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో జరిగిన ఐదో ఉగ్రదాడి దేశ భద్రతకు, సైనికుల ప్రాణాలకు ముప్పును తెలియజేస్తుందని అన్నారు. తీవ్రవాద దాడులకు పటిష్ఠమైన చర్యల ద్వారానే పరిష్కారం ఉంటుంది తప్ప ఖాళీ ప్రసంగాలు, తప్పుడు వాగ్దానాలు వల్ల కాదని వ్యాఖ్యానించారు.