దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక నేతలను అరెస్టు చేసింది. మరికొందరిని సమన్లు జారీ చేసి విచారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది.
ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మరోసారి ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇప్పటివరకు ఈడీ ఐదుసార్లు సమన్లు ఇవ్వగా ఆయన ఒక్కసారి కూడా విచారణకు వెళ్లలేదు. తనను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈడీ పదేపదే నోటీసులు ఇస్తోందని ఓవైపు కేజ్రీవాల్, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
‘ఈ రోజు కూడా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. మేం చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటాం. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, దిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని మోదీ లక్ష్యం. మేం అలా జరగనివ్వం’ అని ఆప్ నేతలు తెలిపారు.