దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారి అని ఈడీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని, ఆ నిధులతోనే గోవాలోని విలాసవంతమైన హోటల్‌లో బస చేశారని పేర్కొంది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది.
మద్యం విధానంపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేశామని కేజ్రీవాల్ చెప్పడం కట్టుకథని ఈడీ స్పష్టం చేసింది. బుధవారం పీఎంఎల్‌ఏ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకుంది. 12వ తేదీన కేజ్రీవాల్‌ను హాజరుపరచాలంటూ ప్రొడక్షన్ వారెంట్‌ను జారీ చేసింది. 209 పేజీలో అభియోగపత్రం దాఖలు చేసిన ఈడీ అందులో కేజ్రీవాల్‌ను కీలక కుట్రదారుగా పేర్కొంది. అందుకే మనీ లాండరింగ్ కేసులో ఆయన శిక్షకు అర్హుడని పేర్కొంది.
‘ఈ కుంభకోణంలో విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారు. ఎల్1గా ఉన్న మద్యం వ్యాపారులు ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో పంజాబ్‌లో వారిని ఇబ్బంది పెట్టారు. భారాస నాయకురాలు కవిత సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారు. విజయ్ నాయర్ ద్వారా రూ.100 కోట్లను ఆప్ నేతలకు అందించారు’ అని అభియోగపత్రంలో ఈడీ వెల్లడించింది.