ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ ఆప్ పై సంచలన ఆరోపణలు చేశాడు. 2014 నుంచి 2022 మధ్య కాలంలో ఖలిస్థానీ గ్రూప్‌ల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.133.54 కోట్ల నిధులు అందాయని వెల్లడించాడు. తమకు ఆర్థిక సాయం అందిస్తే అందుకు బదులుగా టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ భుల్లార్ ని విడుదల చేస్తామని డీల్ కుదుర్చుకున్నట్టు సంచలన విషయం చెప్పాడు. 1993 ఢిల్లీ బాంబు పేలుడు కేసులో భుల్లార్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు.
ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా..31 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెర్రరిస్ట్‌ని విడిచిపెడతామని కేజ్రీవాల్ ఒప్పందం కుదుర్చుకున్నట్టు పన్నున్ ఆరోపించాడు. అటు అమెరికాతో పాటు కెనడాలోనూ పౌరసత్వం ఉన్న గురుపత్వంత్…సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ సంచలన విషయాలు చెప్పాడు. Sikhs For Justice చీఫ్‌గా కెనడా నుంచి ఖలిస్థాన్ వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తున్నాడు. కెనడా సహా పలు దేశాల్లో ఆందోళనలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన ఈ సమయంలో వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. 2014లో అరవింద్ కేజ్రీవాల్, ఖలిస్థాన్ మద్దతుదారులు కొందరు న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హాల్‌లో గురుద్వారలో భేటీ అయ్యారని, అక్కడే ఆర్థిక సాయం అడిగాడని చెప్పాడు గురుపత్వంత్.