దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లోనే జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ప్రకటనలో బిజీగా మారాయి. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలని భావిస్తున్న ఇండియా కూటమి ఓ వైపు.. మూడో సారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ మరోవైపు పావులు కదుపుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అభ్యర్థుల ప్రకటనలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్య నేతలు, సీనియర్ నేతలు, కొత్త నేతలు ఇలా అన్ని వర్గాలను బేస్ చేసుకుని క్యాండేట్స్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కూడిన ఆరో జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో రాజస్థాన్‌కు నలుగురు, తమిళనాడుకు ఒకరిని ప్రకటించారు.రాజస్థాన్‌లోని అజ్మీర్ స్థానం నుంచి రామచంద్ర చౌదరి, రాజ్‌సమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వారా నుంచి డాక్టర్ దామోదర్ గుర్జర్, కోట నుంచి ప్రహ్లాద్ గుంజాల్‌లు బరిలో నిలిచారు. వీరితో పాటు తమిళనాడులోని తిరునల్వేలి లోక్‌సభ స్థానం నుంచి న్యాయవాది సి.రాబర్ట్ బ్రూస్‌కు టికెట్ ఇచ్చారు.