భారత్‌ను విభజించేందుకు కుట్రకు ప్రయత్నం జరుగుగుతోందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. నిషేధిత వేర్పాటువాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడైనట్లు సమాచారం. భారత్‌ను విభజించి అనేక దేశాలు సృష్టించాలని ఈ ఖలిస్థాన్ ఉగ్రవాది ఆలోచిస్తున్నట్లు తెలిసింది. భారతదేశ ఐక్యత, సమగ్రతను సవాలు చేస్తూ పన్నూ ఆడియో మెసేజ్‌లు విడుదల చేసినట్లు వెల్లడైంది. దేశాన్ని మతపరంగా విభజించి ఓ వర్గానికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని అతను కోరుకుంటున్నట్లు దర్యాప్తులో తేలినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
మరోవైపు కెనడాలో ఉంటున్న హిందువులు భారత్‌కు వెళ్లిపోవాలంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చర్యలకు ఉపక్రమించిన భారత్.. ఇక్కడున్న అతడి ఆస్తులను జప్తు చేసింది.
పంజాబ్‌తోపాటు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గురుపత్వంత్ సింగ్ పన్నూను.. NIA 2019లో మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది. అయితే అతడు.. ప్రత్యేక ఖలిస్థాన్ కోసం పోరాడటం, ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు NIA దర్యాప్తులో తేలింది. దీంతో అదే ఏడాది సిఖ్స్ ఫర్ జస్టిస్‌ను NIA నిషేధించింది.