కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే చాలా మంది జంపింగ్ టిల్లులు.. పార్టీలు మారుతూ ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకులు, సర్వేలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. అందుకే దీని నుంచి దృష్టి మరల్చి ఎలాగైన కన్నడ పీఠం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది.
ఇందులో భాగంగానే సినీ తారలను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ను పార్టీలో చేర్చుకుంటోంది. ఇవాళ మధ్యాహ్నం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలో సుదీప్ కాషాయతీర్థం పుచ్చుకోనున్నాడు. సుదీప్తోపాటు దర్శన్ తూగుదీప కూడా కాషాయ కండువా కప్పుకోనున్నాడు. వచ్చేనెల 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి. అవినీతి, అసమర్థ పాలనతో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న కమలం పార్టీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెబుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.