దేశవ్యాప్తంగా రేపటి నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారతదేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ముఖ్యంగా తమిళనాడు, కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో శుక్రవారం తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కుంభవృష్టి కురుస్తోంది. అకాల వర్షాల కారణంగా..తమిళనాడు డెల్టా ప్రాంతంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అదేవిధంగా చెన్నై,పుదుచ్చేరి సహా 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.పుదుచ్చేరిలో భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఓ ప్రభుత్వాస్పత్రి వరదలో చిక్కుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రోగులను మరో ఆస్పత్రికి తరలించారు. భారీ వరదల కారణంగా చెన్నై, పుదుచ్చేరి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.