లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఇప్పటివరకు 5 విడతల్లో 430 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఐదో విడత సార్వత్రిక ఎన్నికల్లో 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఆరో విడత, జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇక ఐదో విడతలో ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, బంగాల్ 7, బిహార్, ఒడిశాలో 5చొప్పున, ఝార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు తెల్లవారుజాము నుంచే ఓటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు.