కరోనా బారిన పడి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వస్తుందన్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా ఐసీయూలో కోవిడ్ చికత్స తీసుకున్నవారు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కోవిడ్ నుంచి కోలుకుంటే వారికి బ్లాక్ ఫంగస్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే బ్లాక్ ఫంగస్ కేసులు పలు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొందరికి లంగ్ ఫైబ్రోసిస్, న్యుమోనియా సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వయస్సు ఎక్కువగా ఉన్నవారు, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఐసీయూల్లో చికిత్సలు ఎక్కువగా తీసుకున్న వారు కోవిడ్ నుంచి కోలుకుంటే వారికి లంగ్ ఫైబ్రోసిస్, న్యుమోనియా వస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అలాంటి వారికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అవుతుందని, అయితే వారిలో పరిస్థితి అంత తీవ్రతరం కావడం లేదని, ఇంట్లో ఉండి ఆక్సిజన్ తీసుకున్నా సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కొందరిలో శ్వాస తీసుకోవడంలో సమస్యలు, పొడి దగ్గు, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని, అయితే ఇవి లంగ్ ఫైబ్రోసిస్, న్యుమోనియా అయి ఉండే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఈ లక్షణాలు కనిపించే వారు ఆలస్యం చేయకుండా హాస్పిటల్‌లో చూపించుకోవాలని సూచిస్తున్నారు.
కాగా ప్రస్తుతం కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్న వారి సంఖ్య 10-15 శాతంగా ఉందని లంగ్ అండ్ రెస్పిరేటరీ స్పెషలిస్ట్ డాక్టర్ ధ్రువ్ చౌదరి వెల్లడించారు. అలాగే 40 శాతం మందికి లంగ్ ఫైబ్రోసిస్, న్యుమోనియా సమస్యలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఆయా లక్షణాలు కనిపించే వారు నిర్లక్ష్యం వహించరాదని నిపుణులు సూచిస్తున్నారు.