పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో గవర్నర్.. ఎడిట్ చేసిన వీడియోను సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. అసలు వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్ తన వద్ద ఉందని, వాటిలో దిగ్భ్రాంతికర దృశ్యాలు ఉన్నాయని చెప్పారు.
గవర్నర్ పదవికి ఎందుకు రాజీనామా చేయనక్కర్లేదో ఆనందబోస్ స్వయంగా వివరణ ఇవ్వాలి. ఆనందబోస్ గవర్నర్‌గా ఉన్నంతకాలం నేను రాజ్‌భవన్‌కు వెళ్లబోను. తప్పనిసరి అయితే వీధుల్లోనే ఆయన్ను కలుస్తాను. ఆనందబోస్ పక్కన కూర్చోవడం కూడా పాపమే. దీదీగిరిని సహించబోనని గవర్నర్ అంటున్నారు. కానీ ఆయన దాదాగిరీ ఇక పనిచేయదు. మహిళలపై వేధింపులకు పాల్పడిన ఆయన పదవి నుంచి దిగిపోవాలి’’ అని మమత పేర్కొన్నారు.
మహిళపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెబుతున్న మే 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సాధారణ పౌరులకు ఆనందబోస్ చూపించిన సంగతి తెలిసిందే. దీనిపై బాధితురాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలో తన ముఖాన్ని బ్లర్ చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.