మణిపూర్ హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనాన్ని వీడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రధాని మౌనం ప్రజల పుండ్లపై కారం చల్లినట్టు ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘హింస చెలరేగిన నెల తర్వాత హోం మంత్రిని అక్కడికి పంపారని అక్కడికి వెళ్లి ఆయన చేసిందేం లేదని మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత కూడా మణిపూర్‌లో హింస కొనసాగుతుందని తెలిపారు. ఇక ఆయన అక్కడికి వెళ్లి శాంతిని ఎక్కడ పునరుద్ధరించారని ప్రశ్నించారు. ‘యాక్ట్ ఈస్ట్’ ప్రతిపాదన ఏమైందని మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ప్రధానిగా కనీసం శాంతి కోసం విజ్ఞప్తి చేయాల్సిందని అన్నారు. మణిపూర్‌ను మోదీ మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
మరోవైపు హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో శాంతి స్థాపన దిశగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. గవర్నర్ నేతృత్వంలో శాంతి కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నేతలను సభ్యులుగా నియమించింది. ఇంకా కమిటీలో మాజీ బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, వివిధ జాతుల నేతలు సభ్యులుగా ఉంటారని పేర్కొంది.