తమ పార్టీకి విరాళంగా ఇచ్చిన సొమ్మును ఎన్డీఏ సర్కార్ స్తంభింపజేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రస్తుతం తమ దగ్గర డబ్బు లేదని, తీవ్రస్థాయిలో నిధుల కొరతను ఎదుర్కొంటున్నామని అన్నారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఎన్డీయే ఫ్రీజే చేసిందని, ఆ ఖాతాల్లో ప్రజలు విరాళంగా ఇచ్చిన సొమ్ము ఉందని తెలిపారు. బీజేపీ మాత్రం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన దాతల వివరాలు బయటపెట్టడానికి వెనకాడుతున్నారని విమర్శించారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.
మరోవైపు రూ. 100 కోట్ల ఆదాయపు పన్ను బకాయి వివాదంలో కాంగ్రెస్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ మొత్తం వసూలుకు ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసుపై స్టే విధించడానికి ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) నిరాకరించింది. దానిలో జోక్యం చేసుకునేందుకు దిల్లీ హైకోర్టు కూడా అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందన వచ్చింది.