లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నట్లు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం సృష్టించింది. ఇంత జరుగుతున్నా ఈ వ్యవహారంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించలేదు. అయితే తాజాగా దీనిపై దీదీ మౌనం వీడారు. ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
2024 ఎన్నికల ముందు తీసుకునే ఆ నిర్ణయం ఆమెకే మేలు చేస్తుందని మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన టీఎంసీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మమతా బెనర్జీ…. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్ మరో మూడు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. మైనార్టీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, వారిని తాము ఓబీసీ కోటా కిందకు తెస్తామని హామీ ఇచ్చారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి క్రికెట్ టీం వరకు దేశమంతా వేగంగా కాషాయీకరణ జరుగుతోందని మమతా బెనర్జీ విమర్శించారు.