ఎత్తు బాగా తక్కువ ఉన్నవారు అంటే సమాజంలో ఎప్పుడూ అలాంటి వారిని చిన్న చూపే చూస్తారు. వారు నిత్యం వివక్షకు, హేళనకు, అవమానాలకు గురవుతుంటారు. కొందరు అలాంటి వారిని ఎగతాళి చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఆ వ్యక్తి కూడా అలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. కానీ సొంత కాళ్లపై నిలబడ్డాడు. ఎవరి సహాయం అవసరం లేకుండా స్వతంత్రంగా జీవిస్తున్నాడు. అయితే అతను ఎత్తు బాగా తక్కువగా ఉండడం వల్ల ఎవరూ అతన్ని పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అతను తనకు ఎలాగైనా పెళ్లి చేయాలని కోరుతూ పోలీసులను సంప్రదించాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల అజీమ్ మన్సూరి ఎత్తు చాలా తక్కువగా ఉంటాడు. అతని ఎత్తు 2 అడుగుల 3 ఇంచులు మాత్రమే. దీంతో అతను చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో అతను వాటిని భరించలేక స్కూల్ కూడా మానేశాడు. తరువాత చాలా కాలం వరకు తన సోదరులతో కలిసి ఓ కాస్మొటిక్ షాప్‌లో పనిచేశాడు. అనంతరం తానే సొంతంగా కాస్మొటిక్ షాప్‌ను పెట్టుకున్నాడు. డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నాడు. అయితే తాను ఎత్తు తక్కువగా ఉన్నందున ఏ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవడం లేదని, తనను చూసేందుకు వస్తున్నారని, కానీ చూశాక మరోమాట మాట్లాడకుండా వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక ఇదే విషయమై అజీమ్ గతంలో అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్‌ను కలిసి మొర పెట్టుకున్నాడు. తరువాత పలు మార్లు కలెక్టర్‌ను కూడా కలిసి తనకు పెళ్లి చేయాలని కోరాడు. ఇప్పుడు తాజాగా షమ్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఎలాగైనా తనకు పెళ్లి జరిగేలా చూడాలని కోరాడు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఓ ఉద్యోగిని వద్దకు వెళ్లి.. మేడమ్, ప్లీజ్, ఎలాగైనా నాకు పెళ్లి జరిగేలా చూడండి.. సహాయం చేయండి.. అని కోరాడు. మరి పోలీసులైనా స్పందిస్తారా, లేదా అన్నది చూడాలి.