మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యావత్ దేశంలో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ ఘటన పార్లమెంట్‌ను అట్టుడికించింది. ముఖ్యంగా మణిపుర్ ఘటనపై రాజ్యసభ దద్దరిల్లింది. తక్షణమే ఈ అంశంపై రూల్ 267 కింద చర్చ చేపట్టాలని విపక్షాలు రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కఢ్‌ను డిమాండ్ చేశారు. స్వల్పకాలిక చర్చ కోసం ఎనిమిది మంది సభ్యులు ఇచ్చిన నోటీసులను ఆయన అంగీకరించగా… 267 కింద చర్చ చేపట్టాలంటూ అన్ని విపక్షాల సభ్యులు ఆందోళనకు దిగారు.
ఈ అంశంపై చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయల్ తెలిపారు. అయితే సభా కార్యకలాపాలన్నింటినీ రద్దుచేసి మణిపుర్ అంశంపై చర్చ జరపాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మొదట ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని ఆయన పట్టుబడుతూ… విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.