ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ సుప్రీంకోర్టు సెప్టెంబర్ కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పై స్పందించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి మరింత సమయం ఇచ్చింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో మనిష్ సిసోడియాను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం పలుమార్లు సిసోడియా కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ ఆయనకు మాత్రం ఊరట లభించడం లేదు.
ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ పై లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గతేడాది సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారు. సిసోడియాతో పాటు పలువురిపై అవినీతి ఆరోపణలు చేశారు. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. లిక్కర్ పాలసీ లోని ఆర్థిక అవకతవకలపై ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది.