ఆటో డెబిట్ ఫీచర్ ద్వారా మొబైల్ బిల్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ చెల్లింపులు, ఇతర పేమెంట్లు చేస్తున్నారా ? అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇకపై ఆటో డెబిట్ ఫీచర్ ఆయా మాధ్యమాల్లో పనిచేయదు. అంటే.. మీరు నెల నెలా చెల్లించే బిల్లులు, ఇతర పేమెంట్లు ఆటోమేటిగ్గా జరగవన్నమాట. మీరే మాన్యువల్ గా పేమెంట్లు చేయాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు ఏదైనా ఓటీటీ యాప్ ను నెలవారీ సబ్స్క్రిప్షన్ విధానంలో వాడుతున్నారనుకుందాం. అందుకు మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో ఆటోమేటిగ్గా నెల నెలా పేమెంట్ డెబిట్ అయ్యేలా సెట్ చేసుకున్నారనుకుందాం. ఇప్పటి వరకు అలా జరిగింది. కానీ ఇకపై మీ కార్డుల నుంచి పేమెంట్ ఆటోమేటిగ్గా డెబిట్ కాదు. మీరే పేమెంట్ మాన్యువల్‌గా చేయాల్సి ఉంటుంది. దేశంలో ఇలా ఆటోమేటిక్ డెబిట్‌ను వాడుతున్న అందరికీ ఈ కొత్త రూల్ వర్తిస్తుంది. దీన్ని ఆర్బీఐ ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనుంది.
సాధారణంగానే మనం వాడే అనేక యాప్‌లు, సైట్లలో మన క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, ఇతర బ్యాంకింగ్ సమాచారం స్టోర్ అయి ఉంటుంది. దీంతో మనం పేమెంట్లను సులభంగా చేయలుగుతాం. అయితే ఆర్బీఐ అమలు చేయనున్న రూల్ వల్ల ఇకపై ఆ సమాచారం ఆయా యాప్‌లు, సైట్లలో స్టోర్ కాదు. డేలా లీక్ కాకూడదన్న ఉద్దేశంతో ఆర్బీఐ ఈ విధానాన్ని అమలు చేస్తోంది. దీని వల్ల ఇకపై ఎందులోనైనా సరే మాన్యువల్ గానే పేమెంట్లు చేయాల్సి ఉంటుంది. అయితే అలా పేమెంట్లు చేయడానికి ముందు సంబంధిత సంస్థలు, కంపెనీలు ముందుగా వినియోగదారులకు అలర్ట్ పంపించాలి. వినియోగదారుడు ఓకే చెబితేనే చెల్లింపులు చేయాలి. అదే రూ.5వేలకు పైబడిన చెల్లింపులు అయితే ఓటీపీ అవసరం ఉంటుంది.
ఇక ఆర్బీఐ తెచ్చిన ఈ రూల్‌ను అమలు చేసేందుకు బ్యాంకులు, ఇతర సంస్థలు ఇప్పటికీ సిద్ధం కాలేదు. మరి ఏప్రిల్ 1 నుంచి ఏం జరుగుతుందో చూడాలి.