భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మరోసారి సెల్ఫీ దిగారు. ‘మెలోడీ’ ట్యాగ్(#Melodi)తో ఓ సెల్ఫీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇటలీలోని అపులియా వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ఇటలీ ప్రధాని మెలోనీ ‘నమస్తే’ అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్ది సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు.
సమావేశాలు పూర్తయిన అనంతరం మెలోనీ మోదీతో సెల్ఫీ వీడియోను తీసి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘హాయ్ ఫ్రెండ్స్, ఫ్రమ్ మెలోడీ’ అని ఆ వీడియోలో మెలోనీ అనడం గమనార్హం. ఈ వీడియో పోస్టు చేసిన తర్వాత క్యాప్షన్ కూడా అదే ఇవ్వడం ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
గతేడాది డిసెంబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా జరిగిన కాప్28 సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్ అయింది. మోదీతో తీసుకున్న స్వీయ చిత్రాన్ని మెలోనీ ఎక్స్‌లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. అప్పటి నుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది.
Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024