భారీ మెజార్టీతో స్థిరమైన దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి చారిత్రక బిల్లు సాకారమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన సందర్భంగా దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మాట్లాడుతూ మోదీ.. బలమైన, స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇది మరోసారి నిరూపించిందని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు సాధారణ చట్టం కాదన్న మోదీ.. నూతన ప్రజాస్వామ్య నిబద్ధకు నిలువుటద్దమని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు మహిళా బిల్లును వ్యతిరేకించిన వారే.. మహిళల శక్తిని తెలుసుకుని మద్దతు తెలిపారని చెప్పారు. మహిళా సంకెళ్లను తెంచేందుకు ఎన్డీఏ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని.. మరెన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. మహిళా సంక్షేమం, భద్రత, గౌరవానికి అనేక పథకాలు తీసుకువచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ పాల్గొన్నారు.