గుండెపోటు కేసుల్లో మరణాలకు ప్రధాన కారణం అదేనట.. ఎయిమ్స్ అధ్యయనంలో వెల్లడి

తీవ్ర గుండెపోటు వచ్చిన సందర్భాల్లో సరైన చికిత్సలో జాప్యమే మరణాలకు ప్రధాన కారణమని తాజా నివేదిక వెల్లడించింది. కొందరు బాధితులు మాత్రమే అత్యవసర చికిత్స కోసం సకాలంలో ఆస్పత్రులను సంప్రదిస్తున్నారని పేర్కొంది. ఆస్పత్రికి చేరుకునే జాప్యాన్ని వివిధ స్థాయిలో పరిష్కరించినట్లయితే హార్ట్ అటాక్ మరణాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో జరిపిన అధ్యయన నివేదికను ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ ప్రచురించింది.

‘స్ట్రోక్‌తోపాటు గుండెకు సంబంధించి అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రతికూల ఫలితానికి కారణమవుతుంది. జాప్యం చేయడం వల్ల అత్యంత ముఖ్యమైన థెరపీలు అందకపోవడంతో ఫలితం మారిపోతుంది. తీవ్ర గుండెపోటు కేసుల్లో జాప్యం లేకుండా సరైన సమయంలో చికిత్స అందించినట్లయితే మరణం ముప్పును 30శాతం తగ్గించవచ్చు’ అని తాజా నివేదిక వెల్లడించింది. ఉత్తరాదిలో గుండెపోటు/ స్ట్రోక్‌ మరణాలు, అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు అవసరమైన చికిత్సలో జాప్యానికి గల కారణాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) నేతృత్వంలో ఎయిమ్స్‌ నిపుణులు ఓ అధ్యయనం జరిపారు.