‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిల్​పై.. ఇరుపక్షాలు వాదనలను ఇవాళ హైకోర్టు ధర్మాసనం విన్నది.

రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకునే అధికారం రిజర్వు బ్యాంకుకు లేదని పిటిషనర్ రజనీశ్ భాస్కర్ గుప్తా తరఫు న్యాయవాది సందీప్ అగర్వాల్.. ధర్మాసనం ఎదుట వాదించారు. అదే విధంగా రెండు వేల రూపాయల నోట్ల జీవిత కాలం 4-5 సంవత్సరాలు మాత్రమేనని ఆర్​బీఐ ఎలా నిర్ధరణకు వచ్చిందన్నారు పిటిషనర్​. నోట్లను జారీ చేయడం, తిరిగి జారీ చేయడం వంటి అధికారాలు మాత్రమే రిజర్వు బ్యాంకుకు ఉన్నాయని ఆయన వాదించారు.

మరోవైపు ఈ వాదనలను ఆర్‌బీఐ తరపు న్యాయవాది పరాగ్ పి త్రిపాఠి వ్యతిరేకించారు. 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మాత్రమేనని ఆయన కోర్టుకు విన్నవించార. ఇది ఆర్థిక విధానానికి సంబంధించిన అంశమని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. అనంతరం తీర్పును రిజర్వ్​ చేసింది.