పులి పంజా నుంచి కొడుకుని కాపాడిన తల్లి

-

తల్లి తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళ్తుంది. ఎవరినైనా ఎదిరిస్తుంది. ఎంతటి బలశాలులతోనైనా పోరాడుతుంది. ఎదురుగా ఉంది మంత్రైనా.. ముఖ్యమంత్రైనా.. ప్రధానమంత్రైనా.. మనిషైనా.. జంతువైనా.. పులైనా.. సింహమైనా.. ఏదైనాసరే తన బిడ్డ ప్రాణాల మీదకు వచ్చిందంటే తన ప్రాణాలొడ్డి కాపాడుతుంది. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పులి పంజాలో చిక్కుకున్న తన 15 నెలల కుమారుడిని ఓ తల్లి తెగువతో కాపాడింది. ఈ క్రమంలో గాయాలపాలైన తల్లీకుమారులిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ లోని రోహ్​నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్​, అర్చన దంపతులకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం కాలకృత్యాలకై కుమారుడు రవిరాజును బాంధవ్​గఢ్​ టైగర్​ రిజర్వ్ ప్రాంతంలోని పొలానికి తీసుకెళ్లింది అర్చన. ఇంతలో అక్కడికి వచ్చిన పులి.. వారిపై దాడి చేసింది. బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. చిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చననూ గాయపరిచింది. అర్చన అవేవీ లెక్కచేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది.

అర్చన కేకలు విని కొంత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకుని పులిని చెదరగొట్టారు. దీంతో పులి అడవిలోకి పారిపోయింది. గాయపడిన తల్లీ, కుమారుడిని వెంటనే మన్​పుర్​లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఉమరియా జిల్లా ఆస్పత్రికి తరలించారని ఫారెస్ట్​ గార్డ్​ రామ్​ సింగ్​ మార్కొ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news