మణిపుర్ వ్యవహారం.. పార్లమెంట్‌ వద్ద రాత్రంతా విపక్షాల మౌనదీక్ష

-

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్ వ్యవహారం అట్టుడికిస్తోంది. ముఖ్యంగా ఇటీవల మణిపుర్​లో జరిగిన అమానవీయ ఘటన అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. విపక్షాల కూటమి పట్టువిడవకపోవడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడం మరింత దుమారం రేపింది. ఈ నేపథ్యంలో.. ఓవైపు మణిపుర్ వ్యవహారంపై కేంద్రం చర్చించాల్సిందేనని డిమాండ్ చేస్తూ.. ఎంపీని సస్పెండ్​ చేయడంపై మండిపడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.

ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ సహా ‘ఇండియా (విపక్ష కూటమి)’ సభ్యులు సోమవారం రాత్రి 11 గంటలకు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం ఎదుట మౌనదీక్ష చేశారు. సస్పెన్షన్‌ వేటు పడిన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. రాత్రంతా వీరు నిరసన కొనసాగించారు. సోమవారం కూడా ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగడంతో ఉభయ సభల కార్యకలాపాలు స్తంభించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news