ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని ముంబయి పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
బలమైన ఈదురు గాలుల ధాటికి ఘట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో సోమవారం 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై కూలిన విషయం తెలిసిందే. ఈ హోర్డింగ్‌కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. మరోవైపు ఘటనాస్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పరిశీలించారు. నగరంలోని అన్ని హోర్డింగ్‌లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు